Friday, December 11, 2009

తెలుగునాడు..




"మా తెలుగు తల్లికీ మల్లె పూదండా మా కన్న తల్లికీ మంగళారతులు..."

ఒకప్పుడు ప్రతి పాఠశాలలో వినిపించే ప్రార్థనాగీతం. కానీ ప్రస్తుత పరిస్థితి అగమ్యగోచరం.విద్యాధికులు,ధనికులు,పేదలూ అనే తేడా లేకుండా నగరాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు పల్లెల్ని కూడా ఈ రొంపిలోకి లాగటానికి ప్రయత్నిస్తున్నారు.

త్రిలింగభాషగా..మొదలైన మన తేనలూరే తెలుగు భాషను ఇప్పుడు మాండలీకాలనూ, యాసలనూ వేదికగా చేసుకుని చీల్చటానికి కొన్ని శక్తులు శతధాసహశ్రధ ప్రయత్నిస్తున్నాయి..ఈ కాష్టంలో కాలుతున్నది మాత్రం సామాన్యుడు. నేను పుట్టింది, పెరిగి విద్యా బుధ్ధులు నేర్చిందీ తెలంగాణాలోనే..తల్లితండ్రులు జన్మతః కోస్తా తీరవాసులైనా నాకు హైదరాబాదే పుట్టిల్లు. ఏ ప్రాంతమైనా నాది ఆంధ్రప్రదేశ్, మాది తెలుగు భాష అని గర్వంగా చెప్పుకునే వాడిని. గత రెండు వారాలుగా సాగుతున్న రాద్ధాంతం కొత్తదేమీ కాదు ఎన్నో ఏళ్ళుగా ఉన్నదే. కానీ కొత్తగా ఇప్పుడు జరిగిందేమిట్రా అంటే.. కేంద్ర ప్రభుత్వం దీనికి స్పందించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఊటంకించటం.

శ్రీ కేసీఆర్ గారి పాచిక ఈ సారి బాగా పారిందనే చెప్పాలి. 2001 వరకు తెలుగుదేశంలో ఉండి అందులోనుండి విడిపోయి తెలంగాణా రాష్ట్ర సమితి పేరుతో ప్రత్యేక తెలంగాణా రాష్త్ర సాధనే మానిఫెస్టోగా 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో చేతులు కలిపారు.అప్పుడు ఆయనకి ఇచ్చిన మంత్రి పదివిని నిర్వర్తించి కొన్నాళ్ళకే రాజీనామా చేశారు, కారణం కేంద్రం తెలంగాణాకి అనుమతి ఇవ్వలేదు అని.ఈయన ఘన చరిత్ర ఏమని చెప్పాలి? ఓ ఏడాది పాటు తన నియోజికవర్గం దరిదాపుల్లోకి కూడా వెళ్ళకపోయేంత బిజీ అయిపోయారు...దానికి ఆయన్ని ఆ ప్రాంతం ప్రజలు నిలదీస్తే అక్కడ్నుండి ఎలాగో తప్పించుకుని బయటపడ్డారు. సొంత లాభాపేక్షతో ఆయన చేస్తున్న ప్రచారాలని ప్రజలు తెలుసుకున్నట్టున్నారు..పాపం గత అసెంబ్లీ ఎన్నికల్లో అతి తక్కువ సీట్లు సంపాదించుకోగలిగారు..అప్పుడు ఆయన తమ ఓటమికి కారణం తెలుగుదేశంతో పొత్తేనని చెప్పుకున్నారు...అవును పాపం ప్రజలకి తెలీదు ఎవరికి ఓటెయ్యాలో. పిచ్చి జనం వారి పొత్తులతో బాధపడ్డారో లేక వారి ఎత్తులతో విసిగిపోయారో, వారిని పులుసులో లేకుండా చేశారు.
ఏదేమైనప్పటికీ ఆ పార్టీ అస్తిత్వానికి సవాలు ఎదురయింది. దానికి తోడు తోడుగా ఉంటారనుకున్న పార్టీసభ్యులందరూ మెల్లగా తలో దారీ చూసుకోవటం గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టైది. మింగలేకా కక్కలేకా ఎలాగో అలా తన ఉనికిని కాపాడుకొనే ప్రయత్నంలో మరో సారి తెలంగాణ గానం ఎత్తుకున్నారు. ఈ సారి కాస్త నాటకీయంగా తాను నిరాహార దీక్ష చేయబోతున్నాననీ...ఆ చెయ్యబోయే ముందు మరి బుజ్జగింపులకోసమో ఉజ్జాయింపులకోసమో అన్నట్టుగా రాష్ట్ర మరియూ కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి మరీ ఆ నిర్ణయం తీసుకున్నారు.

దీక్ష ప్రారంభానికి వెళ్ళె ముందు మీడియాతో "బహుశా ఇదే నేను మీకిస్తున్న ఆఖరి ఇంటర్వ్యూ కావచ్చు" అని ఓ నాటకీయ డైలాగు. ఆ తర్వాత సాగిన ఎత్తులు పైఎత్తులు, పగిలిన అద్దాలు, తగలబడిన బస్సులు,మనుషులూ, విరిగిన లాఠీలు...ఇవన్నీ అందరం చూశాం, ఆవేశపడ్డాం, చలించిపోయాం.

గాంధేయ పద్దతిలో ఆయన దీక్షమొదలుపెట్టారు బానే ఉంది...అత్యుత్సాహానికి పోయి మన పోలీసులు వీరంగం చేశారు. అది చిలికి చిలికి గాలివానయ్యింది. ఎందరో అమాయకులకు గాయాలు,ప్రాణహాని,ఆస్తి నష్టం. కానీ అంతా శాంతియుతంగా జరిగింది అని మీడియాలో వార్తలు. "శాంతియుతం" అనే పదానికి కొత్త సవరణలూ, అర్ధాలు ఉన్నాయేమోమరి వారి నిఘంటువులలో.

ఈ వారం-పదిరొజుల్లో టీవీ ద్వారా చూసిన కొన్ని దృస్యాలు, వాటి తాలూకు స్పందనలు.

ఒకానొక తెరాస నేత ఓ విలేఖరితో చెప్పటం,

నేత: "మేము మా కార్యకర్తలూ శాంతియుతంగా మా నిరసనని తెలియజేస్తున్నాము...ఎవరికి ఎలాంటి నష్టం జరగదు. ఇవాళ బస్సులు కదలకుండా బంద్ నిర్వహిస్తున్నం"
విలేఖరి: మరి ఇలా రవాణాను ఆపితే సామాన్య ప్రజ ఇబ్బంది పడదా?
నేత: లేదండీ ఇక్కడున్న ప్రయాణీకులంతా స్వచ్చందంగా తమ మద్దత్తు తెలపటానికే బస్టాండుకు వచ్చారు..వారేమీ ఇబ్బంది పడటంలేదు
(అప్పటికే దాదాపు అక్కడ 100 మందికి పైగా ప్రయాణీకులు వారి కుటుంబాలతో దిక్కుతోచక బిక్కు బిక్కుమంటూ కూర్చుని, "మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టటం భావ్యమా" అని విలేఖరులని అడగటం జరిగింది)
ఒకవేళ ఆ ప్రయాణీకులు నిజంగా స్వచ్చందంగా తమ మద్దతు తెలపటానికే ఐతే పాపం వాళ్ళూ సూటుకేసులు, పిల్లల్ని తీసుకుని బస్సు కౌంటరు దగ్గర ఎందుకుంటారో ఆ నేతగారే చెప్పగలరేమో

శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాం అని ఆయన చెప్తుండగానే కర్రలు పట్టుకుని "జై తెలంగాణా" అని అరుస్తూ వీధుల మీద పరిగెడుతున్న తెరాస కార్యకర్తలూ విధ్యార్ధులని చూపించారు ఆ ఛానెల్ వారు..శాంతియుతమంటే ఆయుధాలని చేతబూని ప్రజల్ని భయపెట్టటం, ఆ కారల్తో వాళ్ళు బస్సుల అద్దాలను పగల గొట్టటం అని అర్ధమేమో మరి.

న్యాయవాదులూ, విద్యావేత్తలూ, అందరూ అవకాశం దొరికింది కదా అని తమ మద్దతుని తెలిపారు... నాకు అర్ధంకానిదేమిటంటే ఇన్నాళ్ళూ ఏమైంది? ఇప్పుడు కొత్తగా ఓ వ్యక్తి/నేత నిరాహార దీక్షతో ఇంతగా స్పందించినవారు ఇన్నేళ్ళుగా జరుగుతున్న ఆకలి చావులను గమనించలేకపోయారా? ప్రజా శ్రేయస్సుకంటే ఓ నాయకుడే ముఖ్యమా? ఆయనమీద అంత గౌరవమూ నమ్మకమూ ఉండి ఉంటే గత ఎన్నికలలో ఆయన్ని (ఆ పార్టీని) ఎందుకు గెలిపించలేదూ?

మొదటిరోజు ఆసుపత్రిలో ఆయన దీక్ష విరమించినట్టు ఆయన పళ్ళరసం తాగుతున్నట్టు మీడియా చూపించింది..దానికి ఉద్రేకులైపోయిన ప్రజ ఆయన్ని దూషించటం మొదలుపెట్టింది. మరి అది తెలుసుకుని భయపడ్డారో ఏమో వెంటనే విలేఖర్లని సమావేశపెట్టి "తాను దీక్ష కొనసాగిస్తున్నట్టు తెలియజేసారు...అది పళ్ళరసం అని ఆయనకి తెలీదనీ ఇంకేదో అనీ" చాలా చెప్పారు...ఇంకేదో ఐనా ఎందుకు తాగారో మరి ఆయనకే తెలియాలి.శరీరంలోకి ఏదో రూపేణా సత్తువని అందజేస్తూ ఆయన్ని దీక్షలో కొనసాగించినవారికి జేజేలు..

ఇక విద్యార్ధులు ఇతర్త్రా శ్రేణుల జనం చేసిన వీరంగం అంతా ఇంతా కాదు...కనపడిన ప్రతివాడినీ కెలకటం మీడియా వంతైతే...దొరికిన ప్రతి మైకులోనూ పూనకించి మాట్లాడటం వారి వంతూ అయ్యింది.

బస్సులు,విగ్రహాలు,సంస్థా కార్యాలయాలు కావేవీ విధ్వంశానికి అనర్హం అని కనపడిన వాటిలో చాలానే ధ్వంసం చేయటం, వారి చర్యలని నేతలు చాలా గొప్పగా వెనకేసుకురావటం. చూస్తుంటె మతి పోతుంది...మన ఆస్తికి మనమే నష్టం కలిగించుకుంటూ...మన పూర్వీకులనీ మన భాష ఔన్నత్యాన్నీ మనమే పాడుచేసుకోవటం ఏం లక్ష్య సాధన? స్వర్గీయ ఎన్.టీ.ఆర్ (తెలుగు వారందరం ఒకటి మనం ఓ శక్తి అని చాటినవారు), శ్రీ పొట్టి శ్రీరాములు(ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావానికి ప్రాణం అర్పించినవారు) ఇలా ఎందరివో విగ్రహాలని ధ్వసం చేశారు. ఇంకా నయం శ్రీ కృష్ణదేవరాయలూ, అన్నమయ్య మొదలగువారి విగ్రహాలని కూడా ధ్వంసం చేసేస్తారేమొ అని భయపడ్డాను. కారణం వారు తెలంగాణేతర వ్యక్తులు.

నేతలు చెప్పటం ఒక ఎత్తు, జనం నమ్మటం మరో ఎత్తు...నేతల్లో కొందరు "మాకు తెలంగాణా కావాలి ఆంధ్రా మరియూ రాయలసీమ వాసులు మాకు చేస్తున్న అన్యాయాన్ని అరికట్టాలి వారిని ఇక్కడి నుండి తరిమి కొట్టాలి" అని అంటు ప్రసంగాలు ఇచ్చారు. ఎవరినైనా ఎలా వెళ్ళగొట్టగలరు? రాజ్యాంగబధ్ధంగా, చట్టబధ్ధంగా అది ఎలా సాధ్యం? ప్రతి భారతీయునికీ తాను ఉండాలనుకునే చోట ఉండటానికీ పనిచేసుకోటానికీ సర్వహక్కులూ ఉన్నాయి. ఇది అర్ధం చేసుకోలేని వారు నేతలై ప్రసంగాలివ్వటం వారిని ప్రజలు వినటం. చదువుకున్నవారు కూడా ఈ ప్రలోభవాక్యాలను నమ్మటం విస్మయం కలిగిస్తుంది. కొందరు ఆదివాసీ తెగలు, చదువుకోని వారు తెలియక నేతలు చెప్పిన భాష్యాలకి చప్పట్లు కొడుతున్నారు.ఒకవేళ ఆ తెలంగాణా నేతలన్నట్టు తెలంగాణేతర వ్యక్తులు వెళ్ళిపోవాలి ఇక్కడుండకూడదూ అంటె...పరాయి రాష్ట్రాల్లో/దేశాల్లో/ఖండాల్లో ఉన్నావారందరిని తమ తమ ప్రాంతాలకి తరళి రమ్మనండి. అక్కడెక్కడొ కూర్చుని ఎగరటం కాదు ఇక్కడికి వచ్హ్చి మాట్లాడమనండి. ఉద్యమంలోని అర్ధాన్ని కనీసం ఓ పది శాతానికైనా తెలియనివ్వండి...చాలామంది మాండలీకాలని బట్టి ప్రాంత విభజన జరుగుతుంది అనే అపోహలో ఉన్నారు...ఒకవేళ అదే ఐతే మనకి ప్రతి జిల్ల ఓ రాష్ట్రంగా ఏర్పడుతుంది...ఒక్కో జిల్లలో కూడా మరిన్ని యాసలున్నాయి మనకి మరి వాటిని కూడా విభజించాలేమో.మనలో మనం కొట్టుకు చావటం ఆపితే మనల్ని కీలు బొమ్మలు చేసి ఆడుతూ వినోదిస్తున్నా వారిని చూడగలుగుతాం.

నాకు తెలిసినంతవరకు గ్రహించినంతవరకు...తెలంగాణ,రాయలసీమా,కోస్తా సామాన్య ప్రజలకు ఎటువంటి ద్వేషాలూ లేవు స్వార్ధ రాజకీయ నాయకులు ఆడుతున్న చదరంగంలో పావులుగా మారుతున్నారందరూ.

వాహనాలపైన ఏపీ అని కనిపిస్తే అది కొట్టేసి టీజీ అని రాయటం, ఆర్.ఎస్ బ్రదర్స్, ఆంధ్ర బ్యాంకు వంటి వాటి మీద ప్రతాపం చూపించటం దేనికి? ఆర్.ఎస్ బ్రదర్స్లో తెలంగాణా వాసులకు బట్టలు అమ్మం అని చెప్పారా?ఆంధ్రా బాంకులో తెలంగాణా ఖాతాదారులు లేరా? పేరు వల్లే మీకు ఇబ్బంధి ఐతే ఆంధ్రప్రదేశ్ ని తెలుగునాడు అని పిలుచుకుందాం ఏమంటారు?

ఓ వ్యక్తి మైకు దొరకగానె కేసీఆర్ ని ఉద్దేశిస్తూ "అన్నా బతికుంటే బలుసాకు తిని బతకొచ్చు కానీ నువ్వు చావద్దొన్నా నువ్వు దీక్ష విరమించి ఉద్యమం సాగించు" అని అన్నారు..."బతికుంటే బలుసాకు తినటం" అనే వాక్యం నాకెంతో నవ్వు తెప్పించింది.ఆ సంధర్భంలో అది వెటకారంగా వాడినట్టనిపించింది...ఆ వెరితనానికి నవ్వుకున్నాను

ఆ కేసీఆర్ గారు ఆసుపత్రిలొ ఉన్నంతకాలం చాలా సీరియస్ గా ఉన్నారు పరిస్థితి విషమం నేడో రేపో అని గోల పెట్టారు మరి అంత దయనీయ స్థితిలో ఉన్నా ఆయన ఓ గ్లాసుడు నిమ్మరసం తాగగానే..ఎమర్జెన్సీ నుండి మామూలు గదికీ మరునాడు ఇంటికీ ఎలా వెళ్ళగలిగారో ఆ ఈశ్వరుడికే తెలియాలి.


అప్పటిదాకా గోలలని చూసిన అధికార పార్టీ శ్రేణులు, ప్రతిపక్షాలు అందరూ వారి వారి మద్దత్తు తెలిపారు ఉద్యమానికి...ప్రజల్లో వారి ఉనికిని చాటుకోటానికి...వారి ఉనికిని కాపాడుకోటానికి..కానీ ఆ పంధాలో ప్రజల్లో ఎన్నో ఉద్వేగాల్ని రేపారు.

ఎప్పుడైతే ప్రత్యేక తెలంగాణా అని కేంద్రం నిర్ణయాన్ని ప్రకటించగానే అందరూ కేసీఆర్ ని పొగిడారు..ఆ నిర్ణయాన్ని ఎప్పుడైతే తెలంగాణేతర ప్రజలు వ్యతిరేకించారో ఈ "గోపీ" నేతలు(గోడమీద పిల్లులు) అందరూ ప్లేటు ఫిరాయించే దారిలో పడటంలోనే ప్రజలకి అర్ధంకావాలి వారి అవకాసవాదాలు...ఇప్పుడు రాష్ట్రాన్ని ఎన్ని ముక్కలు చేయాలి ఎవరెవరు ఎవరెవరిని పంచుకోవాలి అని మంతనాలు సాగిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలు సమైఖ్యంగా ఉండి ఇలాంటి వాళ్ళకి బుధ్ధి చెప్పాలి..తెలంగాణా వాసులకి ఇతర ప్రాంత వాసుల పట్ల ఎటువంటి ద్వేషాలు లేవని చాటి చెప్పాలి. భగ్గుమంటున్న రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదీ.

తెలంగాణా మీద కేంద్రం నిర్ణయం తొందరపాటే అనిపిస్తుంది ఇన్నాళ్ళుగా స్పందించనిది ఇవాళ కొన్ని గొడవలూ ఓ నేత నిరాహారదీక్ష(?) కి తలొగ్గటం హాస్యస్పదమే కాదు ఆందోలణకరం కూడా..ఇలా ప్రభుత్వం తలొగ్గి ఏకపక్ష నిర్ణయం తీసుకోవటం ఏంటి? అంధ్రప్రదేశ్ ని విడదీయటం కేవలం తెలంగాణా వాసుల చేతిలో ఎలా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ అనేది అందరిదీ కదా?మరి అలాంటప్పుడు మిగతా వారిని సంప్రదించకుండా రాత్రికి రాత్రి ఎలా నిర్ణయం తీసుకుంటారు? అదే విషయంగా అందరిలోనూ నిరసన వ్యక్తమవుతుంది..ఏదేమైనా ఇప్పుడు రాజకీయపరంగా అందరూ ప్రజలని బాగా మభ్యపెడుతున్నారు.దీనివల్ల ఏమి జరిగినా జరగకున్నా అందరిలో ఓ ఉత్కంఠత, ఓ అర్ధంకాని పరిస్థితి. చదువుకున్న వాళ్ళు, ఉద్యోగం చేస్తున్నవాళ్ళు, వ్యాపారాలు చేస్తున్నవాళ్ళు ఇలా అందరికీ ప్రశ్నార్ధకం. లోకల్/నాన్-లోకల్ ల గోల.India is a Sovereign,democratic,secular,republic country free from religious and regional fanaticism. Lets remain thus and respect each other as public than being in a herd of sheep to follow uneducated political personnel or the so called "Leaders" Lets pray that these people will get into their senses soon and stop tormenting people's sentiments and emotions. lets be wise and not behave as uneducated literates. Lets deal with the crisis together and workout unitedly.



ఇట్లు భవదీయుడు,
దారినపోయే దానయ్య



Monday, September 7, 2009

పదవి ఎవరికి చేదు?

రాష్ట్ర రాజకీయరంగం ప్రస్తుతం ఓ రణరంగాన్ని తలపిస్తోంది. ఒక వైపు వైయస్స్ తనయుడు జగన్ ను సీయం చేయాలని రాష్ట్రవ్యాప్తంగా నిరాహారదీక్షలు, ఆత్మహత్యలు(?), సినిమా నటీనటులతో ప్రచారాలూ జరుగుతున్నాయి మరోవైపు హస్తినలో అధిష్టానం సీయల్పీ నేతను ఎన్నుకోవటానికి మల్లగుల్లాలు పడుతోంది.

రెండ్రోజులుగా ఎ ఐ సీ సీ లో సాగుతున్న చదరంగంలో పావులు చాలా వేగంగా, కీలకంగా, ఆసక్తిగా కదులుతున్నాయి. మొదట్నుండీ పరిగణలో ఉన్న జగన్, రోశయ్యలు అధిష్టానినిదే తుది నిర్ణయం అని మీడియాతో అన్న మాటల్లో వారికి అధిష్టానం పై ఎంత విశ్వాసం ఉందొ కరెక్టుగా చెప్పటం కొంచం కష్టమే.

ఈ సంధర్భంలో “మిమ్మల్నే పదవి కొన్సాగించమని అధిష్టానం అడిగితే మీరేమంటారు” అని ప్రశ్నించగా ముఖ్యమంత్రి రోశయ్యగారు “మాది ఒక చిన్న పార్టీ కాదు ఒక జాతీయ పార్టీ, మాకంటూ కొన్ని నియమాలూ, పద్దతులు ఉన్నాయి, అధిష్టానానిదే తుదినిర్ణయం అనీ, ఒకవేళ అధిష్టానం బావిలో దూకమన్నా, సముద్రంలో దుకమన్నా తాను దూకుతాననీ, మొదట్నుండీ తాను చేస్తున్నది అదేననీ, పార్టీకి నేనెల్లప్పుడూ విధేయుడినేనని” చెప్పటం పై ఆయనలో ముఖ్యమంత్రి అభ్యర్ధిత్వం పై ఆశ ఉన్నట్టు అనిపిస్తుంది.

ఇక తర్వాత కొంచం ఆలస్యంగా తెరపైకి ఎక్కిన మరికొందరు నేతల పేర్లు, జేసీ, జైపాల్ రెడ్డీ, డీయస్స్. మొదట్నుండీ డీయస్స్ రాష్ట్ర కాంగ్రెస్లో ఓ కృయాశీల పాత్ర పోషిస్తూ వచ్చారు కానీ మధ్యలో కొన్ని విబేధాల కారణంగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిగారికీ ఆయనకూ ఉన్న సంబంధం చెడిందని మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి, దానికి ఊటంకిస్తూ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీయస్స్ ఓటమి చర్చనీయానంశమయ్యింది, అదే విధంగా జేసీ దివాకర్ రెడ్డికీ వైయస్స్ కీ బేధాభిప్రాయాలు వచ్చాయనీ, దాని కారణంగానే ఆయనకి రాష్ట్ర మంత్రిమండళిలో స్థానం లభించలేదనీ భోగట్టా, ప్రస్తుత రాజకీయ పరిస్తితుల్లో జేసీ, జగన్ అభ్యర్ధిత్వంపై సరిగ్గా స్పందించకపోవటంతో, ఆయనకూడా రేసులో ఉండాలనుకుంటున్నారనీ వార్తలొచ్చాయి. ఒకప్పుడు చాలా పలుకుబడి ఉన్న నేతగా పేరున్న జేసీ ప్రస్తుతం ఒంటరివారయ్యారు, ఆయన్ని కాంగ్రెస్స్ ఎమ్మెల్యేలెవరూ పట్టించుకోకుండా ఉన్నారు, మొదట్లో “జగన్ పై మీ ఉద్దేశ్యమేమిటంటూ" ప్రశ్నించగా “పార్టీశ్రేణుల్లో ఎవరూ నన్ను ఈ విషయం పై సంప్రదించలేదని” సమాధానమివ్వటం పరోక్షంగా జగన్ ని తాను సమర్ధించట్లేదని ప్రకటించంట్లయ్యింది, మళ్ళీ ఏమనుకున్నారో ఈరోజు ఆయనే స్వయంగా సోనియా గారికి జగన్ కి మద్దతు తెలుపుతూ లేఖ రాసారట, మరి ఇది దిగజారుతున్న తన పరిస్తితిని మెరుగు పరుచుకోటానికో లేక హటాత్తుగా జగన్ పై పుట్టుకొచ్చిన మమకారమో ఆయనకే తెలియాలి.

ఇవాల్టి వార్తల్లో మరిన్ని పేర్లు తెరంగేట్రం చేసి ఆసక్తిని రేకెత్తించాయి, అవి రాష్ట్ర ముఖ్యసలహాదారు, స్వర్గీయ వైయస్స్ కి ఆప్తమిత్రుడు అయిన కేవీపీ, ప్రస్తుత హోం మినిష్టర్ సబితా ఇందిరారెడ్డి, మాజీ ముఖ్యమంత్రీ, తెలుగుదేశం పార్టేఎ వ్యవస్థాపకుడూ, ఆంధ్ర ప్రజానీకం “అన్నగారు” అని సంబోధించే స్వర్గీయ ఎన్.టీ.ఆర్ గారి కుమార్తే అయిన దగ్గుబాటి పురందరేశ్వరి పేర్లు.ఈ పరిణామం దేశంలో సాగుతున్న మహిళా అధికార ధ్రోణి ప్రభావమేమోననే ఊహాగానాలకి తావిస్తోంది, మహిళా రాష్ట్రపతి, హస్తినకి మహిళా ముఖ్యమంత్రి, ఆంధ్రాలో ఓ మహిళ చేత అత్యంత కీలకమైన గృహమంత్రిత్వ శాఖని అధిరోహింపచేయటం, ఈ విషయాలన్నీ మహిళలకి రాజకీయాల్లో సాధికారత సంపాదించిపెడుతున్నాయని అందరు భావించారు, ఆనందపడ్డారు. ఈ కారణంగానే మన రాష్ట్రానికి ఓ మహిళని ముఖ్యమంత్రిగా చేయాలని అధిష్టానం భావించి ఉండొచ్చు, యూపీయే చైర్ పర్సన్ సోనియా గాంధీ కూడా ఓ మహిళే కావటం మరో ప్రధానాంశం.

మీడియాలో ఎన్ని ఊహాగానాలొస్తున్నా ఏ ఒక్క అభ్యర్ధైనా "లేదు నాకు ఆ పదవి వద్దు" అని ప్రకటించారేమో చూడండి, ఐనా పదవెవరికి చేదు చెప్పండి, అందరూ అధిష్టాన నిర్ణయమే శిరోధార్యమనే మంత్రాన్ని జపిస్తూ లౌక్యంగా తప్పించుకుంటున్నారు నిజమే, ఈ పరిస్థితి లో ఎవరైనా బహిరంగంగా నేను బరిలో ఉన్నాను అని చెప్పే సాహసం చేయగలరా? అసలే సానుబూతి ముసుగులో జగన్ కి పట్టం కట్టేందుకు చాలా ఆందోళనలు చేస్తున్నారు, చేయిస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలూ, నేతలూ, ఎమెల్యేలు, మరిలా ఉండగా "నాకేగనక సీయం చాన్సు ఇస్తే" అని ఎవరినైనా వ్యాసం రాయమంటే ఎం రాస్తారు చెప్పండి. అనధికార సమాచారం ప్రకారం ఎనభై శాతం అవకాశం జగన్ కేనని గాలి. ఏదేమైనా ఈ నాటకానికి మరో మూడు రోజుల్లో తెరపడనుందని హస్తిన నుండి వర్తమానం, అంతవరకు వేచిచూడాల్సిందే. అంతవరకు ఈ పదవి కుమ్ములాట ఎవరికీ చేటు కాకుండా ఉంటె అంతే చాలు.

(మొదట్లో ఆత్మహత్యలు అనే పదం పక్కన ప్రశ్నార్ధకం పెట్టటానికి గల కారణం, నాకు ఆ విషయం అర్ధంకాకపోవటమే, నిరాహార దీక్షలు చేస్తున్నారంటె సరే, గొడవచేస్తున్నారంటె సరే, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నారన్నా సరే, కానీ నిజంగా ఆత్మహత్య చేసేసుకుంటె ఎం లాభం అంటే అందరూ ఆత్మహత్య చేసుకున్నారనుకోండీ ఇక ఆ ఫలానా వ్యక్తి సీయం అయ్యి ఏం ఉపయోగం?)

భవధీయుడు
దారినపోయే దానయ్య

Saturday, September 5, 2009

పదవి ఆస్తా? బాధ్యతా?

మన దివంగత ముఖ్యమంత్రికి కొందరు నివాళులర్పించే విధానాన్ని చూస్తే ఆవేదన కలుగుతోంది. ఒక ప్రజనాయకుడికి ఇదేనా మనమిచ్చే గౌరవం? ప్రజలకి ఒక గొప్ప బాసటగా నిలిచిన శ్రీ వై.యస్స్.ఆర్ గారిని ఖననం చేస్తున్నప్పుడు రోదనలకంటే, వివిధ మతాలవారు ఆయన ఆత్మశాంతికై చేస్తున్న ప్రార్థనలకంటే పెద్దగా జయజయ నాదాలు వినపడ్డాయి. వై.యస్స్.ఆర్ గారి తనయుడు జగన్ని ముఖ్యమంత్రిగా చూడాలి అని అనుకోవటం సబబే కానీ దానికి ఇదా సందర్భం? ఇదా సమయం? “వై. యస్స్ .ఆర్ అమర్ రహే” కి బదులుగా “కాబోయే సీయం జగన్” అని నినదించిన ఆ కార్యకర్తలకి, నేతలకి, అసలు గతించిన మనిషిపైన ఏమాత్రం గౌరవముందో అర్ధమవుతుంది. తండ్రి పోయిన దుఃఖంలో ఉన్న తనయుడిని ఓదార్చే తీరిదేనా? మనుషులయ్యుండి ఇంత విచక్షణలేకుండా ఎలా ప్రవర్తించగలుగుతున్నారు? స్వర్గస్తులయ్యింది మనం రాజ్యాంగబద్ధంగా ఎంచుకున్న నాయకుడు ఆయన మరణాన్ని ఇంకొకరికి పట్టం కట్టే సంధర్భంగా అభివర్నించటం కడు సోచనీయం.

ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా శ్రీ రోశయ్యగారిని ప్రభుత్వం ప్రకటించింది మరి కొన్ని రోజుల్లో మళ్ళీ అధిష్టానం ముఖ్యమంత్రి పదవి పై ఒక నిర్ణయానికి వస్తుంది, అప్పుడు కదా మన మద్దత్తు ఎవరికన్నది తెలపాల్సింది?

వార్తాపత్రికల్లో జగన్ సీయం కావాలని శిరోముండనం చేసుకున్న అభిమానులు, పిల్లలు అని ఫోటోలు ప్రచురించారు. వారిలో సగానికి పైగా ఉన్నది నాలుగేళ్ళనుండి పదమూడేళ్ళ మధ్యలో ఉన్న పిల్లలే, నిజంగా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఉంటారా? ఆలోచించండి అసలు సీయం అంటే ఏమిటో కూడా సరిగ్గా తెలియని వయసు వారిది ఎవరో కార్యకర్తల ప్రోద్బలంతో జరిగే ఇలాంటి పొలిటికల్ డ్రామాలని అభిమానం అని ఎలా అనుకుంటారో అర్ధంకావట్లేదు. మన రాజ్యాంగంలో ఓటు హక్కు పద్దెనిమిదేళ్ళు పైబడ్డ యువతీయువకులకివ్వటం ఇలాంటి ప్రలోభాలని, బలవంతాలని అడ్డుకోవటానికే కదా.

పూర్వం రాజులహయాంలో సక్షత్రియులు మాత్రమే రాజ్యమేలేవారు (క్షత్రియుడంటే అదో వర్గమో, కులమో కాదు), వారి తదనంతరం రాజ్యాన్ని వారి వారసులకి అందించటం సాంప్రదాయం అది కూడా వారికి సరైన శిక్షణనిచ్చి, పలురకాల పరీక్షలు పెట్టి, బుధ్ధి, తెలివి, రాజనీతి, యుద్ధవిద్యాదులలో ప్రావీణ్యం ఉన్నప్పుడే రాజ్యాధికారాన్ని అప్పజెప్పేవారు, మన ఆస్తిని మన పిల్లలకి పంచివ్వటం సరైనదే కావచ్చు కానీ ఆ క్రమంలోనే, పరాయిదేశస్తులకి కొమ్ముకాచి చివరికి వారికి బానిసలుగా దశాబ్దాలపాటు వెట్టిచాకిరి చేసి దేశాన్నీ, దేశ సంపదలనీ అమూల్యమైన మన జాతి ఔన్నత్యాన్ని, ఆత్మాభిమాన్నాన్ని కోల్పోయాం, మళ్ళీ ఎన్నో రక్తతర్పణలతో స్వతంత్రులుగా అయ్యాం, ఎవరో కొందరు రాజులు భయంవల్లనో, మొహమాటం వల్లనో, పేరాశ వల్లనో, అమాయకత్వం వల్లనో, నిస్సహాయత వల్లనో, లేక పిరికితనం వల్లనో చేసిన పనికి సస్యశ్యామలము, సకలవిద్యా ధామము, సుసంపన్నము ఐన మనజాతి బిడ్డలు తెల్లవరి మోజేతి నీళ్ళు తాగాల్సిన అగత్యం పట్టింది. ఇలాంటిది మళ్ళీ జరగకూడదని ప్రజలనీ, వారి బాగోగులని చూసే బాధ్యతగలిగిన పదవులని సైతం ఆస్తులుగా పరిగణించటం సరికాదనే ఉద్దేశ్యంతో, రాజ్యాలనీ, రాజులనీ కాదని ప్రజలందరిని ఒక నీడకిందకి తీసుకొచ్చి రాజ్యాంగాన్నీ, రాజకీయాన్నీ ప్రవేశపెట్టుకున్నాం. మరి అలాంటప్పుడు ఇంకా ఈ వారసత్వ పరిపాలనలెందుకు? సానుభూతిని ప్రదర్శించటానికి ఇదొక్కటే పద్ధతా?

ప్రభుత్వకార్యాలయాల్లో ఎవరైన చనిపోతే వారి పదవులని వారి వారసులకి అందించే వీలుంది. మంత్ర పదవి కూడా ప్రభుత్వోద్యోగమే కానీ దానిని కూడా మిగతా వాటితో సరికట్టటం ఎంతవరకు న్యాయం? చిన్న ఉద్యోగాలలో అవకతవకలని సరిచేసుకునే వీలు ఉండొచ్చు, వీలుకాని పరిస్తితిలో అయినా ఆ నష్టం తక్కువగానే ఉంటుంది, అదే ఒక బాధ్యతగల మంత్రి పదవిని అనుభవంలేని వారికి ఇస్తే ఎదైనా తప్పు జరిగితే దాని నష్టం ఎంత పెద్దగా ఉంటుందో ఆలోచించాలి. మన దేశ చరిత్రలో ఎందరో వారసులు మంత్రి పదవులు చేపట్టారు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, సబితా ఇందిరా రెడ్డి, దగ్గుబాటి పురందరేశ్వరి, తదితరులెందరో మనకి ఉదాహరణగా ఉన్నారు, వారంతా సమర్ధవంతంగా వారి పదవులని చేపట్టలేదా అని అడగొచ్చు, ఇదే సరైనదైతే ప్రతి ఐదు సంవత్సరాలకొకసారి ఎన్నికలెందుకు? వారి కుంటుంబాలే ఆ పదవుల్లో స్థిరపడిపోవచ్చు కదా? అప్పుడు ఎన్నికల తంతు ఉండదు ప్రతి ఐదేళ్ళకోసారి మనకి ఓటు హక్కు ఉంది అని మనం గుర్తుచేసుకోనక్కర్లేదు, డబ్బు, మందు, గట్రాలను పంచక్కర్లేదు, ఓటు వినియోగించుకోటానికి గంటలతరబడి క్యూలో నిలబడక్కర్లేదు తొక్కిసలాటలు తన్నులాటలు జరగక్కర్లేదు. కానీ మనం ఎన్నికలని నిర్వహిస్తాం, రాజ్యాంగ బధ్ధంగా నాయకులని ఎన్నుకుంటాం ఎందుకని? నాయకుల పని తీరుని గమనించటానికి, నాయకుల అవకతవకలని ఎత్తుచూపటానికి మనదగ్గరున్న ఓటు అనే ఆయుధాన్ని వాడుకోవటం ఎంతో అవసరం కాబట్టి, ఆ ఆయుధమే లేకుంటే మళ్ళీ బానిసత్వశృంఖలాల్లోకి తల్లి భారతిని ఎప్పుడొ నెట్టేసి మరణశిక్ష విధించగలవారున్నారు, దేశాన్ని వేలానికి అమ్మగలిగేంతా మహానాయకులూ ఉన్నారు.

కుటుంబం గొప్పదని చూసి పిల్లలచేతికి అణ్వాస్త్రాన్ని ఇవ్వలేము కదా, ఏం చేస్తారో చూద్దాంలే అని మన భవిష్యత్తును వారిచేతికిచ్చి చూస్తూ కూర్చోలేం కదా, దేశం ప్రయోగశాల కాదు మనమందరం ప్రయోగశాలలోని వస్తువులము కాదు, సానుభూతితో చేసే ప్రయోగం వికటిస్తే ఇప్పుడిప్పుడే గుర్తింపు పొందుతున్న మన దేశం గుర్తేలేకుండా పోయే ప్రమాదం ఉంది. మన దేశాన్ని మనమే కాపాడుకుందాం మన తలరాతలని మనమే దిద్దుకుందాం. రాజ్యాంగపరంగా, చట్టపరంగా, న్యాయపరంగా జీవిద్దాం, నాయకులను సానుభూతితో కాక స్పూర్థితో ఎన్నుకుందాం దేశాన్ని ప్రగతిపథాన నడిపిద్దాం.

ఇదేదో ఒకరిపైన కోపంతోనో, వ్యతిరేకతతోనో వ్రాసింది కాదు, ఒక భారతీయ పౌరుడిగా దేశం పట్ల ఉన్న మమకారమే నా మనసునిలా స్పందింపజేసిందే తప్ప మరొకటి కాదు.ఒకసారి ఆలోచించండి ఎవరి మనోభావాలనైనా నొప్పిస్తే మన్నించండి.

మరోసారి మన చిరునవ్వుల ముఖ్యమంత్రి, రాజకీయానికి సొగసుతెచ్చిన మొనగాడు, మడమతిరగని ధీరుడు శ్రీ యేడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పిస్తూ, వారి ఆత్మకి శాంతి ప్రసాదించాలనీ, వారి కుటుంబానికి మనోస్థైర్యాన్ని, గుండెనిబ్బరాన్ని ప్రసాదించమని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తూ..

భవదీయుడు
దారినపోయే దానయ్య



Wednesday, September 2, 2009


Dr. Yeduguri Sandinti Rajasekhara Reddy
8th Jul 1949 - 3rd Sep 2009

It is a great tragedy to have lost our Chief minister in a chopper crash. Lets pray for his soul and pray for strength to handle this situation.

Wednesday, July 1, 2009

దానయ్య మోక్షం

నమస్కారమండీ బాగున్నారా? ఏవిటీ …ఈ దానయ్య ఇంతకాలం యే దారినా కనపడలేదు, ఇన్నాళ్టికి మళ్ళీ ఇలా దర్శనమిచ్చాడు అని అనుకుంటున్నారా?
హు…ఏమి చెప్పమంటార్లేండి…కడుపు చించుకుంటే దారి పాడవుతుందనీ..

ఓ ఆదివారం రోజు ఎప్పటిలా కాక నా దారినపోయే కార్యక్రమాలకు సెలవిచ్చ్చి ఇంట్లొ టీ.వీ. చూస్తూ మా ఆవిడ అప్పుడే కాచి ఇచ్చిన వేడి వేడి కాఫీ తాగుతూ పేపరులోని వార్తలని ఏదో పరీక్షకు సిద్దమవుతున్న విద్యార్థి రేంజి లో చదువుతూ కూర్చున్నాను.ఇంతలో పెరట్లోనుండి మా ఆవిడ యంగు సూర్యకాంతం, మా పనిమనిషి ఓల్డు రంభల పరస్పర అరుపులు వినపడ్డాయి. నాకెందుకులే అని నేను తాపీగ నా కాఫీని చప్పరిస్తూ ఈనాడు లో “ఇదీ సంగతి” చదివి పడీపడీ నవ్వుకుంటూ కూర్చున్నాను.

మా యంగు సూ.కాం. రుసరుసలాడుతు వంటింట్లోకి వెళ్ళి అటు మూడు గిన్నెలూ , ఇటు ఆరు గరిటెలూ విసిరేసి “యేవండోయ్ ఆ పనిమనిషి పీనుగని ఇక రావద్దనేశాను, దేబ్యం మొఖమూ అదీను, దానికి జీతం పెంచాలిట. పోనిలే ఒకటి, రెండు అంటే, కాదట మరీ ఒకేసారి ఐదు పదులు పెంచాలిట. ఇప్పుడు ఇస్తున్న మూడు వందలే దానికివ్వటం నాకు ససేమిరా ఇష్టం లేదు అయినా ఏదో పెద్దముండ, మొగుడు సంపాదించడు పాపం అని మన పాత పనిమనిషి రికమండేషను చేస్తే జాలి పడి పెట్టుకున్నను. ఇది చూడండి చేరి పట్టుమని మూడు నెలలు కాలేదు అప్పుడే జీతం పెంచాల్ట." గుక్కతిప్పుకొకుండా పురాణం చెప్పింది మా ఆవిడ, చేతిలో అప్పడాలకర్ర పట్టుకుని. ఆ కోపంలో ఎక్కడ ఆ చెయ్యి నామీద విదిలిస్తుందోనని,"పోనీలేవే యాభయ్యేగా, అసలే ధరలు విజయవాడ వేసవిలా మండుతున్నాయి, పైగా నీకు తెలియదేమో బయట ఎక్కడా కూడా ఇంత చవకగా పనివాళ్ళు దొరకరే. మన పక్క వీధిలో రామంగాడు లేడూ, వాళ్ళింట్లొ ఇద్దరే కదా ఉంటా ఐనా వాడి పనిమనిషి ఐదు వందలు తీసుకుంటుందిట, ఆవిడతో పోలిస్తే మన పనిమనిషి నయం కదే" అన్నాను. ఏమనుకుందో ఏమో చేతిలోని అప్పడాల కర్రని ఓ మూలకి గిరాటు వేసి “అసలెందుకండీ యే పనిమనిషి అక్కర్లేకుండానే మన పనులయ్యే మార్గముందండీ” అంది ఆల్రెడీ భూచక్రాల్లా ఉండే కళ్ళని బండి చక్రాలంతవిగా చేస్తూ. “ హేవిటే అదీ కొంపదీసి మీ అమ్మనిగాని పిలుస్తున్నావా ఏవిటి పనిలుచెయ్యటానికి ?” అని అడిగాను నవ్వుతూ, “ఆ.. లేదు మా అమ్మమ్మని పిలుస్తున్నాను, వెఱ్ఱి మిరపకాయ మాటలు మాట్లాడకండి నాకు మండుతుంది…. మొన్న మన పొరిగింటి పంకజమూ నేను చక్రవాకం సీరియలు గురించి కబుర్లాడుకుంటుంటే మాటల మధ్యలో తను తన పనిమనిషిని మానిపించానని చెప్పింది, నేను, ‘అయ్యో మరెల వదినా ఇంటెడు చాకిరి నువ్వే చేసుకుంటున్నావా పాపం? ‘అని అడిగాను దానికి వదినేమందో తెలుసా?” అని ఒక చిన్ని విరామమిచ్చింది ఊపిరి తీసుకోటానికి, “ఇంతకీ ఏమందే?” చిరాకు ప్రదర్శించాను నేను. “ అబ్బ ఉండండీ… అసలు వాళ్ళింట్లొ అన్నయ్యగారు కూడా పంకజానికి సాయం చేస్తారట పొద్దున్నే పిల్లల్ని రెడీ చేయటం, ఆఫీసుకి వెళ్ళేప్పుడు కారియరు సర్దుకోవటం వంటివి ఆయనే చేస్తారట, అంతేకాదు సాయంకాలం ఇంటికి వచ్చాక ఉతికి ఆరేసిన బట్టల్ని మడతపెట్టడం, పిల్లలకి హోంవర్కులు చేయించటం పాలు కలిపివ్వటం అణ్ణం తినిపించి నిద్రపుచ్చటం కూడా చేస్తారట.” అని అంది మారుతున్న నా ముఖకవళికల్ని ఓరకంట గమనిస్తూ. ఏదొ ముంచుకొస్తోంది, అని గ్రహించిన నా కాళ్ళు వాటంతటవే అక్కడ్నుండి జారుకోమని మెల్లిగా కుర్చీలో నుండి లేవటం మొదలు పెట్టాయి… అది గమినించిన మా సూర్యకాంతం నా చెయ్యి పట్టుకుని కుర్చీలోకి నెట్టి కుర్చీ చెయ్యి మీద కూర్చుని నా బుజం మీద చెయ్యి వేసి గోముగా, “ ఏమండీ మనం కూడా అలా పనుల్ని పంచుకుందామండీ ఎంచక్కా పనమ్మాయి అవసరముండకుండా పనులన్ని అయిపోతాయి” అని అంది, త్వరగా ఏదో ఒక పాచిక వేసి అక్కడ్నుండి తప్పించుకోవాలని నేను, “చూడు బంగారం ఆ పక్కింటి దద్దోజనం మొహంగాడు ఏదో అలా చేస్తున్నంత మాత్రాన అందరికీ అది కుదుర్తుందా?, వాడు వెలగబెట్టేది సర్కారి కొలువులో ఉద్యోగమాయె, ఎన్నింటికి వెళ్ళినా గవర్నమెంటు ఉద్యోగంలో అడిగే నాథుడెవడుంటాడు? అక్కడికి వెళ్ళాక కూడా చక్కగా ఫ్యాను కింద గురకపెట్టడం తప్ప వాళ్ళకి పనేమి ఉండదే బోలెడు రెస్టూ… ఇక ఆ మాత్రమన్నా పనులు చెయ్యకపోతే అసలే లావు, ఇంకా బండగా అవుతాడు, వాడలా పని చేస్తే కాస్త బరువన్న తగ్గుతాడని దాక్టరు చెప్పుంటాడు అందుకే అలా చేస్తున్నాడే….. అంతమాత్రానికే వాడేదొ పరోపకారి పాపన్న లా ఇంటెడు చాకిరి చేస్తున్నట్టు అనుకుంటున్నావు నువ్వు… నిజం అర్ధం కాక నన్ను కూడా వాడిలా చెయ్యమంటున్నావు” అన్నాను నేనేదో రమణారావు లా సన్నగా ఉన్నట్టు.

అదంతా నాకనవసరం అన్నట్టు ఒక సారి గోడకున్న గడియారంకేసి చూసి, “ఆగండి చంటిగాడు నిద్రలేచే సమయం అయ్యింది, మళ్ళీ ఏడుస్తాడు కనపడకపోతే, వాడిని లేపి మీతో మాట్లాడతాను, ఇంతలో కొంచం ఆ పొయ్యి మీదున్న పాలని ఆరబెట్టి ఆ గట్టు మీదున్న వెండి గ్లాసులో పోసి ఆరబెట్టండి, చంటోడికి పట్టాలి అని హుకుం జారీ చేసి చంటోడి దగ్గరికి వెళ్ళింది లేచానా లేదా అని ఓ సారి మధ్యలో వెనక్కి తిరిగి చూసి…ఇంకేం చేస్తాం పోనిలే ఈ ఒక్క పని చేద్దాం ఆ తర్వాత ఏదో ఒకటి చేసి ఆ పనిమనిషిని బతిమిలాడో బామాలో మళ్ళీ రప్పిద్దామని అనుకుని వంటింట్లోకి దారితీసాను. పాలని “వెండి” గ్లాసులో (వీడి బారసాలలో చంటోడికి వెండి గ్లాసు, కాంతానికి బంగారు గ్లాసు, నాకేమో ఇత్తడి గ్లాసూ చేయించింది మా అత్త, ఇదేంటత్తా అని అడిగితే పుత్తడి బొమ్మలాంటి మా అమ్మాయిని ఇచ్చానుగా అదే నీకెక్కువల్లుడూ అంటూ లౌక్యంగా ఇచ్చిన ఆ ఇత్తడి గ్లాసుని కూడా లాగేసుకుంది మా సీనియరు సూర్యకాంతం) పోసుకుని ఆరబెడుతూ చంటోడి దగ్గరికి తీసుకెళ్ళాను, గ్లాసుని కాంతానికి ఇవ్వబోయేంతలో “ఏవండేవండి మా బుజ్జి కదూ కొంచం వీడికి పాలు పట్టండి కూరగాయలవాడొచ్చాడు వెళ్ళి ఓ నాలుగు కూరగాయలు కొంటాను, సొరకాయుంటే తీసుకుంటాలెండి, మీరెప్పట్నుండో అడుగుతున్నారుగా దప్పళం పెట్టమని.. “ అని వాకిట్లోకి పరిగెత్తింది ‘ఓ కూరలబ్బీ’ అని అరుచుకుంటూ, ఎదురుగా నిద్రమొహమేసుకుని నన్నే చూస్తున్న చంటిగాడిని చంకనేసుకుని, పాలుతాగించాను ‘ అమ్మో ఏదో ఒకటి చేసెయ్యాలి లేకుంటే నా పని ఇక ఇంటి పనే’ అనుకుంటూ, అప్పుడు నాకు తెలియదు ఇది ఆరంభానికి ఆరంభం మాత్రమేనని.

మొదటి రోజనే సాకుతో ఆవేళ నాకు పాలుతాగించటం వంటి చిన్న చిన్న పనులే చెప్పింది, ఆ మరుసటి రోజు నాకు ప్రమోషను చంటాడికి స్నానం, మధ్యాహ్నం అన్నం కడిగి పడేయటం… ఇలా నెలరోజులయ్యేటప్పటికి…. పొద్దున్నే కోడికూసేవేళకి లేచి పాలవాడి దగ్గర పాలు తీసుకుని కాఫీ పెట్టటం, ఈ లోగా మా ఆవిడవెళ్ళి వాకిలూడ్చి ముగ్గేసి రావటం, తను స్నానము మరియు పూజ ముగించుకుని వచ్చేలోగ నేను అంట్లు తోమి, కూరగాయలు తరగటం… ఇలా మొదలయ్యే దినచర్య సాయంత్రం ఆఫీసు నుండి వచ్చాక బట్టలు మడతపెట్టి ఇస్త్రీ చెయ్యటం (ఇది నా దినచర్యలో కొత్తగ చేరిన పని… అవును మరి ‘చాకలి వాడికెందుకు జతకి మూడున్నర రూపాయలు దండగ కదూ’,మా ఆవిడ ఉద్దేశ్యం) ఆ తర్వాత రాత్రికి భోజనం సిద్ధం చేసి, తిని తొంగోవటం ఇది మా పక్కింటి పంకజాక్షి మొగుడి పుణ్యమాని నా మెడకి చుట్టుకున్న సారీ చుట్టిన ఢోలు.


మరుసటి రోజు ఉదయం మా కాంతం ఎవరితోనో ఫోనులో ఓ ముప్పావుగంట మాట్లాడి మెల్లిగా వచ్చి “ఏవండోయ్ మా బందరు బాబయిగారు లేరూ…” అంటు నా చెవిలో ఊదింది, నేను, “ఎవరూ మీ సీత పిన్ని వాళ్ళాయనేగా? ఏమయిందాయనకి?” అని అడిగాను, “ఏమీ కాలేదండి ఆయనకి మన ఊరిలో ఏదో పని ఉందిట, రేపు సాయంకాలం బండికి మా పిన్నిని తీసుకుని వస్తున్నారట, మన ఇంట్లోనే బస” చల్లగా చెప్పింది కాంతం, “ఓహొ ఎన్ని రోజులుంటారో?” అడిగాను. “ఏమిటండీ మా వాళ్ళు వస్తున్నారు అనగానే మీరు అడిగే మొదటి ప్రశ్న అదేనా…అసలు కొంచమన్నా మర్యదివ్వండి మా వాళ్ళకి, మావాళ్ళేమి గతిలేక రావటం లేదు మన ఇంటికి, ఏదొ పని ఉండి వస్తున్నారు తీరా వచ్చాక ఈ ఊళ్ళో వాళ్ళమ్మాయిని నేనుండగా ఎక్కడో ఉంటే నేను బాధపడతాననే కానీ వాళ్ళేమీ దిక్కులేక రావటంలేదు సుమండీ…… ఐనా ఎణ్ణాళ్ళుంటె మీకెందుకూ… ఉంటారండి ఓ వారం రోజులుంటారు, లేకుంటే నెల రోజులుంటారు అసలిక్కడే ఉండిపోతారండి” అని ముక్కు ఎగబీలుస్తూ లోపలికెళ్ళి పోయింది. తిరణాళ్ళలో తప్పిపోయిన పిల్లవాడిలా నేను బిక్కమొహమేశాను, అసలిప్పుడేమన్నాని? ఎణ్ణాళ్ళుంటారు అని అడిగినంతమాత్రానికేనా ఈ రాద్దాంతం? లేక తెలియక నేనెమైనా అనేసానా? లేదే అంతే కదా నేను అంటా? అసలేంజరిగింది ఇప్పుడు? అని యక్షప్రశ్నలు వేసుకుంటూ పాలు పొంగబెట్టేశాను.

మూలిగే నక్కమీద తాటికాయన్నట్టు అది గమినించిన నా భార్యామణి, "ఇప్పుడేమన్నానని, ఎంత ఉక్రోషమైతే మాత్రం అలా వరాలంటి పాలు పొంగబెట్టేస్తారా ఇప్పుడు చంటోడికి పాలెలాగ? బజారుకెళ్ళి పాలు పట్రండి అని మళ్ళీ ఒకసారి హూంకరించి స్నానాలగది వైపుకి వెళ్ళింది". “ఎవరు చేసిన తప్పు వారనుభవించకా…..” అని పాడుకుంటు పొంగిన పాలు శుభ్రంచేసి తలుపులు ఓరగా వేసి మా వీధిచివరనున్న కిరాణ కొట్టుకెళ్తూంటే ఆ కొట్టు కోమటి తో మాట్లాడుతూ కనిపించింది ఆవిడ. వెంటనే గజేంద్రమోక్షంలోని పద్యాలన్ని నెమరువేసుకుంటూ ఆమెవైపు పరిగెత్తాను.

ఆమె ఎవరో కాదు మా ఓల్ద్ రంభ, అదే మా పనిమనిషి, ఎక్కడాలేని ప్రేమ, మమకారాలు నా గొంతులో మేళవించుకుని, “ఇదిగొ పెంటమ్మా (ఇదే మా పనిమనిషి అసలు పేరు), ఏమిటి అసలు రావటమే మానేశావు, రెండు వారాల క్రితం ఒకట్రెండుసార్లు వచ్చాను నిన్ను కలుద్దామని కాని నువ్వు ఊళ్ళో లెవని అన్నారు” అడిగాను ఏమీ తెలియనోడిలా, “ఏటో బావుగోరు, నానేట్సేయనేదు ఐనా అమ్మగోరు నాతో ఉత్తిపుణ్నానికి గొడవపడేసి నన్ను పొమ్మన్నరు. అసలేటయిందొ ఏటో, పెద్దోళ్ళని నేనొల్లకున్నానయ్య, నానిప్పుడు కూడా రమ్మంటే బాలొచ్చెత్తానయ్యగోరు” అని అంది, నాకర్ధం కాలేదు, “అదేమిటే ఏమీ అవ్వకుండా అలా ఎందుకు అంది? నువ్వేమైనా జీతం పెంచమన్నావా?”..”లేదు బాబయ్య నానెందుకు అడుగుతాను, మీరెంతిత్తె అంతేనమ్మ అనే గందా నాను మాటాడింది, నానడగలేదు బావు” ఇది విన్న నాకు దిమ్మ తిరిగింది. ఆ కోమిటి వాడి కొట్లోనుండి బ్యాక్ గ్రౌండులో పాట “ ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే…”. “సరే పెంటమ్మా నేనమ్మగారితో మాట్లాడి నీకు కబురుపెడతాన్లే, వచ్చి చేరుదువుగాని” అని అన్నాను, “అట్టానె బావు మారాజువి మళ్ళీ పని ఇప్పిత్తానంటాండావు, సల్లంగుండు” పాలు తీసుకుని వెనక్కి వస్తూ ఆలోచనలో పడ్డాను.

ఇంటికి వస్తూనే “ఏమే ఇలా రా నాకు కళ్ళు తిరుగుతున్నాయి ఏంటొ, కాస్త మంచినీళ్ళు పట్టుకునిరా” అంటూ కుర్చీలో కూలబడ్డాను, “అయ్యో ఎమయిందండీ ఇందాక వరకూ బానే ఉన్నారుగా” అంటు నీళ్ళ గ్లాసు పట్టుకుని కంగారుగా వచ్చింది “ ఏమోనే ఈ మధ్య రోజూ ఇలా అవుతోంది పని వల్లనేమోలే అని ఊరుకున్నాను, కానీ ఈవేళ మరీ ఎక్కువగా ఉంది”, “హయ్యో ఏమిటండీ ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు, ఇలా అవుతుందనుకుంటె పని అమ్మాయిని మానిపించేదానిని కాదు” అంది, హమ్మయ్య రూటులోకొచ్చిందనుకుంటూ “పోనీ ఇప్పుడు మాత్రమేమయ్యింది ఆ పెంటమ్మని మళ్ళీ రమ్మనరాదూ, పనిలోకి, ఇక నావల్ల కాదే ఇలా బండెడు చాకిరి చెయ్యటం నే వెళ్ళి బ్రతిమిలాడి వస్తాను నీకభిమానమడ్డొస్తే, అసలే మీ బాబాయిగారొస్తున్నారంటున్నావు పని పెరుగుతుంది, పైగా నేను పెద్దగా ఏమి చెయ్యకున్నా వాళ్ళు ‘చూడు పాపం అబ్బాయి చేత ఇంటెడు చాకిరి చేయిస్తుంది కాంతం’ అని ముక్కునవేలేసుకోరూ? ” దీనంగా అన్నాను, “నిజమేనండీ కాని ఆ పీనుగ డబ్బులు పెంచమంటుంది కదండీ ఇప్పుడెళ్ళి పిలిస్తే లోకువైపోమూ”… అని అంది నీళ్ళు నములుతూ, బిత్తర చూపులు చూస్తూ, మొన్న నేను “నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి” అని పాడుకుంటూ ఇల్లు తుడుస్తున్నప్పుడు ఆ మహాతల్లి వినిందేమొ ఈ సీతమ్మ పిన్ని రూపంలో నన్ను ఆదుకుంది అని ఒకవైపు సంబరపడుతూ, “సర్లేవే నేను ఇప్పుడే వెళ్ళి మాట్లాడివస్తాను సాయంత్రానికి మీ పిన్నీవాళ్ళొస్తారు కదా, ఇక దాని జీతం అంటావా పైస కూడా పెంచను, ఆ రెండు వీధులవతలి మూడో గుడిశేగా అదుండేది” అని అడిగాను వాకిలి వైపు వెల్తూ. ఓక్కసారిగా లేడి పిల్లలా ఛెంగున ఎగిరి నా చెయ్యి పట్టుకుని, “ వద్దులెండి మీరు వెళ్తే ఒకటి నేను వెళ్తె ఒకటీనా, నేనే వెళ్తాను ఏదొ ఒకటి చెప్పి మళ్ళీ పనిలోకి రమ్మని అడుగుతానులె” అని పనిమనిషిని పిలవటానికి వెళ్ళింది మా ఆవిడ.


ఒక గంటాగి మా కాంతంతో కూడా వస్తున్న పెంటమ్మను చూస్తే ఎప్పటిలా చింపిరి జుత్తూ, ఎత్తుచీర కట్టుకునుండే మా ఓల్డు రంభ పెంటమ్మే, గజేంద్రుడ్ని కాపాడటానికి చింద్రవందరగా వస్తున్న శ్రీ మహావిష్ణువు రూపంలో కనిపించింది నాకు. ఆవేల్టి సాయంత్రం మా కాంతం జరిగినదంతా వాళ్ళ పిన్నితో “చూడవే అమ్మ చెప్పిందికదా అని మా పక్కింటి పంకజాం దగ్గర డాబు పోటానికి మీ అల్లుడుగారిచేత పనులు చేయించానా, ఇప్పుడెమో నీ రాక పుణ్యమాంట మళ్ళీ కథ మొదటికొచ్చింది పైగా ఆ పెంటమ్మకేమొ ఇప్పుడు నిజంగానే మూడువందలాయాభై ఇవ్వాల్సివస్తుంది, అసలు అది నాలుగు వందల దగ్గర బేరం మొదలు పెట్టింది, లేకుంటే మీ ఇంట్లో ఇన్ని రోజులు అన్ని పనులూ చేసింది మీ అల్లుడుగారే అని ఊరంతా టాంటాం వేస్తానని భీష్మించుక్కూర్చుంది పైగా జరిగినదంతా మీ అల్లుడిగారికి చెప్పేస్తానని బెదిరించింది దొంగముండ, ఆఖరికి బ్రతిమిలాడి బామాలి మూడువందలయాభైకి మాట్లాడాల్సి వచ్చింది యే గొడవాలేకుండా మూడు వందలకి పనిచేసే దానిని అనవసరంగా గొడవపడి పంపినందుకు నాకు తగిన శాస్తి జరిగింది” అని చెప్పుకుంటూ వాపోయింది. పాపం ఈ దానయ్యే పనిమనిషిచేత అలా బెట్టు చేయించాడని తెలియదు తనకి…

ఇదండీ నా ఈ రెండు నెలాల అఙాతవాసానికి కారణం ఏవిటీ అఙాతవాసంతో పోల్చానని చూస్తున్నారా? మరి అఙాతవాసంలోనే కదండి అంత గొప్పవారైన పాండవులే పనివాళ్ళుగా మారిందీ.. ‘కుంజరయూదంబు దోమకుత్తుకజొచ్చెన్’ అని…. ఇక పై మళ్ళీ మామూలుగానే మరీ ఇంత గ్యాపు లేకుండా మీతో మాట్లాడతానని ఆశిస్తు…


భవదీయుడు,
ఇప్పుడే మళ్ళీ దారిలోకొస్తున్న దానయ్య.

Tuesday, March 24, 2009

రాజకీయరంగమా... చలనచిత్రరంగమా...

నా చిన్నతనంలో పంచతంత్ర కథల్లో, స్థానబలం గురించి ఒక కథ చదివిన గుర్తు. అందులో ఎవరైనా తమతమ నెలవుల్లో ఉంటేనే వారికి బలముంటుందనీ, ఒకరి నెలవులో ఇంకొకరు ఉంటే అంత బలముండదని ఆ కథ సారాంశం. దీనినే కొంచం వేరేగా చెప్తే, ఎవరుండాల్సిన చోట వారుండటమే అందరికీ శ్రేయస్కరం అని అనొచ్చేమో??? ఇంతకీ నా సొద ఏమిటంటే, మొన్నీమధ్య హైదరాబాదులో జరిగిన ప్రజారాజ్యం పార్టీ మీటింగులోనూ, మిగతా పార్టీల మీటింగుల్లోనూ, ఎక్కడ చూసినా, పాలిటిక్సులోకి దూకిన సినీరంగప్రముఖులు కనిపిస్తున్నారు. సినిమాతెరలపైన తళుక్కుమనే తారలిప్పుడు వివిధ పార్టీల ప్రచారసభల్లో దర్శనమిస్తున్నారు. మా ఊళ్ళో, ఒకప్పుడు ఎన్నికలంటే, నేతలు ప్రజలని ఆకర్షించటానికి పార్టీ మీటింగ్లలో పెద్దపెద్ద సినిమా ఆర్టిస్టుల డూపులను, లేదా వారిని అనుకరించే మిమిక్రీ ఆర్టిస్టులనూ తీసుకొచ్చి ప్రచారం చేయించేవారు, ఎన్.టీ.ఆర్, నాగేశ్వర రావు, కృష్ణ, రాజబాబు, రేలంగి లాంటి వాళ్ళని బాగా అనుకరించి ప్రజల్ని మెప్పించేవాళ్ళు. కాని ఇప్పటి రాజకీయ పరిస్తితుల్లో అది సాధ్యం కాదేమో, ఐనా ఇంకా ఇలాంటి సభలకి డిమాండు ఉన్న మిమిక్రీ ఆర్టిస్టులకి మాత్రం ఇది పెద్ద పరీక్షే. ఒకసారి ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీ సభల్లో, చిరంజీవినో, బాలకృష్ణనో, ఎన్.టీ.ఆర్ నో, ఆయన మనవడు జూ. ఎన్.టీ.ఆర్ నో అనుకరించకూడదు, ఎందుకంటే ఆ హీరోలు కాంగ్రెస్కి ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న తెలుగుదేశం, ప్రాజారాజ్యం పార్టీలలో నేతాలాయే, అలానే మిగతా పార్టీల సంగతీ అంతే…. ఒకవైపు చిరంజీవి కొత్తగా పార్టీ పెట్టి తనకున్న ఫ్యాను ఫాలోయింగుతో నెగ్గుతాను అనే ధీమాతో ఉన్నారు, ఆయన తమ్ముడు పవన్ కల్యాణ్ కూడా అన్నగార్ని బాగా ఉత్సాహపరుస్తూ ప్రచారాలలో పాల్గొంటున్నాడు. అటువైపు తెలుగువారందరికీ “అన్న”గా పేరు తెచ్చుకున్న కీ.శే, నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశంలో ఆయన కొడుకులు బాలకృష్ణ, హరికృష్ణలు ఎన్నికల బరిలోకి దూకిన సంగతి అందరికీ విధితమే, ఇప్పుడు కొత్తగా ఎన్నికల్లో కుర్రతనాన్ని నింపటానికి అన్నట్లు, రామారావుగారి మనవడూ, హరికృష్ణ పుత్రుడూ ఐన జూ. ఎన్.టీ.ఆర్, కూడా రేయనకా పగలనకా, ఎండనకా, వాననకా తెలుగుదేశం పార్టీ తరపున ఊరూరూ తిరుగుతూ ప్రచారం చేస్తున్నాడు. అతని మాటతీరు ఏదో అనుభవమున్న ప్రచారకుడిలా స్పష్టంగా, నిబ్బరంగా ఉందని ఈ మధ్యే కొన్ని ప్రధాన వార్తాపత్రికలు కూడా ప్రచురించాయి. ఈ తళుక్కలను తట్టుకోలేకో, మహిళా సెంటిమెంటు కోసమో, లేటెస్టుగా కాంగ్రెస్ పార్టీ సినీనటి జయసుధకి పార్టీ టికెట్టు ఇచ్చింది, ఆ మధ్యకాలంలో “ఆనంద్” సినిమా ఫేం రాజా కూడా ఆ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. మీడియాలను ప్రచారసాధనాలుగా వాడుకునే రాజకీయ పార్టీలు, ఇప్పుడు సినిమావాళ్ళనే ప్రచారానికి వాడుకోవటం వారి ముందడుగో మరి లేక ఇంకో వ్యూహరచనో, వారికే తెలియాలి. ఇంతకీ నేను మొదట్లో అన్నట్లు (లేదా పంచతంత్రంలో ప్రస్తావించినట్లూ) స్థానబలం ప్రతిసారి అవసరముండకపోవచ్చని, "అన్న" ఎన్.టీ.ఆర్, ఎప్పుడో నిరూపించారు, ఆయన నెలవు చలనచిత్ర రంగమనీ, రాజకీయం ఆయన స్థలం కాదని అనుకునే అప్పటి నేతల నోళ్ళు మూయించారు, మన తెలుగులోనే ఒకప్పుడు అగ్ర నాయికగా పేరొందిన జయప్రద కూడ ఉత్తరభారత దేశంలో, పరభాషా ప్రాంతప్రజలను మెప్పించి ప్రజాసేవకి, రాజకీయమైనా, చలనచిత్ర రంగమైనా ఒకటేనని చాటారు.ఈ వరుసలో మోహను బాబునీ, విజయశాంతి నీ, కృష్ణం రాజునీ, దాసరినీ, బాబూమోహన్ నీ, మర్చిపోతే ఆ సెలబ్రిటీలు, లెజెండరీలు ఫీలవుతారు. ఇంతకీ మన కుర్రకారూ, మన పెద్దవారూ, తమ సినిమా అబిమానాలకి పెద్దపీట వేస్తారో, లేక దేశాభివృధ్ధికి అగ్రపూజ్యమిచ్చి పనిమంతులైన నేతలని గెలిపిస్తారో చూడాలి, ఇదే విషయం వెరైటీగా సినీభాషలో చెప్పాలంటే, ఇప్పటి ఎన్నికల గ్లామరు రంగంలో ఏ పార్టీ హిట్టవుతుందో, ఏ పార్టీ నిర్మాతలకి (నేతలకు) బాక్సాఫీసులు బద్దలవుతాయో వేచి చూడాల్సిందే….

ఇట్లు భవదీయుడు
దారినపోయే దానయ్య

Monday, March 23, 2009

రూ. 0/- (రుపీస్ జీరో)

ఈ సంవత్సరం ఎలెక్షన్ ప్రచారాలు జోరుగానే కాదు వింతగా కూడా సాగుతున్నాయి. ఇవాళ పొద్దున్న అలా నెక్లెస్ రోడ్ కి షికారుకి వెళ్ళాను. అక్కడ ఒక ముసలయ్య చేతిలో ఏదొ తళతళలాడుతు ఒక నోటు పట్టుకుని, అటువైపు నుండి వస్తూ కనపడ్డాడు. అతిజాగ్రత్తగా పట్టుకున్నందువల్లనేమో ఆ నోటు కాస్తా చేజారి కిందపడింది. పాపం అని నేను ఆ నోటు ఎత్తి ఆ పెద్దయ్యకివ్వబోతూండగా చూసాను ఆ నోటులోని తేడాని. అది చూడటానికి వెయ్యిరూపాయల నోటులా కనిపిస్తుంది కాని వెయ్యి అని ఉండాల్సిన చోట సున్నా ఉంది... ఏంటి నమ్మరా? మీ కళ్ళతో మీరే చూడండి


'ఇదేంది పెద్దయ్య, ఈ నోటు వింతగుందేం'అని అడిగితే, అది లోక్ సత్తా పార్టీ చలువ అని చెప్పాడు. "అవినీతిని అంతం చేద్దాం" అనే హెడ్డింగుతో ఈ సున్నా రూప్యముల నోటు కాన్సెప్టు కొత్తగా ఉంది, ‘నేను లంచం తీసుకోనని, మరెవ్వరికీ ఇవ్వజూపనని, ప్రమాణము చేయుచున్నాను’ అనే సందేశం చాలా బాగుంది అని అన్నాను, ఆ ముసలయ్య మాత్రం “ఏమి కొత్తో, ఏమి మంచో, ఎన్నికలుగందా పెద్దోళ్ళు ఎన్నడూ లేనట్టు మాబోటి బీదోళ్ళకి డబ్బులిస్తారూ, ఆ పైసలతో నూకలు కొని మా ఇంటిదానికీ, మా పిల్లగోళ్ళకి కూసింత బువ్వెడదామనుకున్నా బాబయ్యా, ఈళ్ళేమో ఈ సత్తు కాయితం సేతులో ఎట్టారు, ఇయ్యాళ కూడా మా గుడిసెలో గంజినీళ్ళే గతి” అని చెప్పుకుని తన చిరిగిన చొక్కాతో కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు.
ఏమి కలికాలమో ఎన్నికలంటే ప్రజలు ఏ నాయకుడు మంచివాడా, ఏ పార్టి నిజంగా తమ ప్రమాణాలు నిలబెట్టి దేశాన్ని సస్యశ్యామలం చేస్తుందా అని కాక మన పేదసోదరులు ఏ నేత డబ్బులిస్తాడా, ఏ పార్టీ సారాయి పోస్తుందా అని ఎదురుచూస్తున్నారు, ఇక మన ఆడపడుచులేమో ఏ పార్టీ ఖరీదైన చీర పెడితే ఆ పార్టీకే ఓటేద్దామని ముచ్చట్లు చెప్పుకుంటూ కనిపిస్తున్నారు, చీరకి ఇచ్చే విలువ, పోసిన సారాయి కి చూపించే విశ్వాసంలో పదో వంతో మన భవిష్యత్తు గురించి ఆలోచించే నేతల గురించో, సేవాతత్పరత ఉండే పార్టీని గుర్తించడంలోనో ఉంటే, మన రాజకీయాల ముఖచిత్రం కొంచమైనా మారుతుందేమో…..

సున్నా రూపాయిలైనా వెయ్యి రూపాయిలైనా చెరగని బోసినావులతో చూస్తూ ఉండె ఓ గాంధీ తాతా, నీ ముఖంలో ఉండే ఆనందం మా బడుగు సోదరుల ముఖాలలో ఎప్పుటికి చూడగలమంటావ్??

ఇంతా అయ్యాక మీరేమనుకుంటున్నారో నాకు తెలుసు ఆ పెద్దయ్యకి నేనన్నా ఏదొ ధన సహాయం చెయ్యాల్సిందనేగా? నేను దారినపోయే దానయ్యనే కాని మేడలోని కుబేరుడ్ని కాదుగా….

ఇట్లు భవదీయుడు
దారినపోయే దానయ్య

* ఇందులోని పాత్రలూ, సన్నివేశాలు కేవలం కల్పితం....