Tuesday, March 24, 2009

రాజకీయరంగమా... చలనచిత్రరంగమా...

నా చిన్నతనంలో పంచతంత్ర కథల్లో, స్థానబలం గురించి ఒక కథ చదివిన గుర్తు. అందులో ఎవరైనా తమతమ నెలవుల్లో ఉంటేనే వారికి బలముంటుందనీ, ఒకరి నెలవులో ఇంకొకరు ఉంటే అంత బలముండదని ఆ కథ సారాంశం. దీనినే కొంచం వేరేగా చెప్తే, ఎవరుండాల్సిన చోట వారుండటమే అందరికీ శ్రేయస్కరం అని అనొచ్చేమో??? ఇంతకీ నా సొద ఏమిటంటే, మొన్నీమధ్య హైదరాబాదులో జరిగిన ప్రజారాజ్యం పార్టీ మీటింగులోనూ, మిగతా పార్టీల మీటింగుల్లోనూ, ఎక్కడ చూసినా, పాలిటిక్సులోకి దూకిన సినీరంగప్రముఖులు కనిపిస్తున్నారు. సినిమాతెరలపైన తళుక్కుమనే తారలిప్పుడు వివిధ పార్టీల ప్రచారసభల్లో దర్శనమిస్తున్నారు. మా ఊళ్ళో, ఒకప్పుడు ఎన్నికలంటే, నేతలు ప్రజలని ఆకర్షించటానికి పార్టీ మీటింగ్లలో పెద్దపెద్ద సినిమా ఆర్టిస్టుల డూపులను, లేదా వారిని అనుకరించే మిమిక్రీ ఆర్టిస్టులనూ తీసుకొచ్చి ప్రచారం చేయించేవారు, ఎన్.టీ.ఆర్, నాగేశ్వర రావు, కృష్ణ, రాజబాబు, రేలంగి లాంటి వాళ్ళని బాగా అనుకరించి ప్రజల్ని మెప్పించేవాళ్ళు. కాని ఇప్పటి రాజకీయ పరిస్తితుల్లో అది సాధ్యం కాదేమో, ఐనా ఇంకా ఇలాంటి సభలకి డిమాండు ఉన్న మిమిక్రీ ఆర్టిస్టులకి మాత్రం ఇది పెద్ద పరీక్షే. ఒకసారి ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీ సభల్లో, చిరంజీవినో, బాలకృష్ణనో, ఎన్.టీ.ఆర్ నో, ఆయన మనవడు జూ. ఎన్.టీ.ఆర్ నో అనుకరించకూడదు, ఎందుకంటే ఆ హీరోలు కాంగ్రెస్కి ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న తెలుగుదేశం, ప్రాజారాజ్యం పార్టీలలో నేతాలాయే, అలానే మిగతా పార్టీల సంగతీ అంతే…. ఒకవైపు చిరంజీవి కొత్తగా పార్టీ పెట్టి తనకున్న ఫ్యాను ఫాలోయింగుతో నెగ్గుతాను అనే ధీమాతో ఉన్నారు, ఆయన తమ్ముడు పవన్ కల్యాణ్ కూడా అన్నగార్ని బాగా ఉత్సాహపరుస్తూ ప్రచారాలలో పాల్గొంటున్నాడు. అటువైపు తెలుగువారందరికీ “అన్న”గా పేరు తెచ్చుకున్న కీ.శే, నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశంలో ఆయన కొడుకులు బాలకృష్ణ, హరికృష్ణలు ఎన్నికల బరిలోకి దూకిన సంగతి అందరికీ విధితమే, ఇప్పుడు కొత్తగా ఎన్నికల్లో కుర్రతనాన్ని నింపటానికి అన్నట్లు, రామారావుగారి మనవడూ, హరికృష్ణ పుత్రుడూ ఐన జూ. ఎన్.టీ.ఆర్, కూడా రేయనకా పగలనకా, ఎండనకా, వాననకా తెలుగుదేశం పార్టీ తరపున ఊరూరూ తిరుగుతూ ప్రచారం చేస్తున్నాడు. అతని మాటతీరు ఏదో అనుభవమున్న ప్రచారకుడిలా స్పష్టంగా, నిబ్బరంగా ఉందని ఈ మధ్యే కొన్ని ప్రధాన వార్తాపత్రికలు కూడా ప్రచురించాయి. ఈ తళుక్కలను తట్టుకోలేకో, మహిళా సెంటిమెంటు కోసమో, లేటెస్టుగా కాంగ్రెస్ పార్టీ సినీనటి జయసుధకి పార్టీ టికెట్టు ఇచ్చింది, ఆ మధ్యకాలంలో “ఆనంద్” సినిమా ఫేం రాజా కూడా ఆ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. మీడియాలను ప్రచారసాధనాలుగా వాడుకునే రాజకీయ పార్టీలు, ఇప్పుడు సినిమావాళ్ళనే ప్రచారానికి వాడుకోవటం వారి ముందడుగో మరి లేక ఇంకో వ్యూహరచనో, వారికే తెలియాలి. ఇంతకీ నేను మొదట్లో అన్నట్లు (లేదా పంచతంత్రంలో ప్రస్తావించినట్లూ) స్థానబలం ప్రతిసారి అవసరముండకపోవచ్చని, "అన్న" ఎన్.టీ.ఆర్, ఎప్పుడో నిరూపించారు, ఆయన నెలవు చలనచిత్ర రంగమనీ, రాజకీయం ఆయన స్థలం కాదని అనుకునే అప్పటి నేతల నోళ్ళు మూయించారు, మన తెలుగులోనే ఒకప్పుడు అగ్ర నాయికగా పేరొందిన జయప్రద కూడ ఉత్తరభారత దేశంలో, పరభాషా ప్రాంతప్రజలను మెప్పించి ప్రజాసేవకి, రాజకీయమైనా, చలనచిత్ర రంగమైనా ఒకటేనని చాటారు.ఈ వరుసలో మోహను బాబునీ, విజయశాంతి నీ, కృష్ణం రాజునీ, దాసరినీ, బాబూమోహన్ నీ, మర్చిపోతే ఆ సెలబ్రిటీలు, లెజెండరీలు ఫీలవుతారు. ఇంతకీ మన కుర్రకారూ, మన పెద్దవారూ, తమ సినిమా అబిమానాలకి పెద్దపీట వేస్తారో, లేక దేశాభివృధ్ధికి అగ్రపూజ్యమిచ్చి పనిమంతులైన నేతలని గెలిపిస్తారో చూడాలి, ఇదే విషయం వెరైటీగా సినీభాషలో చెప్పాలంటే, ఇప్పటి ఎన్నికల గ్లామరు రంగంలో ఏ పార్టీ హిట్టవుతుందో, ఏ పార్టీ నిర్మాతలకి (నేతలకు) బాక్సాఫీసులు బద్దలవుతాయో వేచి చూడాల్సిందే….

ఇట్లు భవదీయుడు
దారినపోయే దానయ్య

Monday, March 23, 2009

రూ. 0/- (రుపీస్ జీరో)

ఈ సంవత్సరం ఎలెక్షన్ ప్రచారాలు జోరుగానే కాదు వింతగా కూడా సాగుతున్నాయి. ఇవాళ పొద్దున్న అలా నెక్లెస్ రోడ్ కి షికారుకి వెళ్ళాను. అక్కడ ఒక ముసలయ్య చేతిలో ఏదొ తళతళలాడుతు ఒక నోటు పట్టుకుని, అటువైపు నుండి వస్తూ కనపడ్డాడు. అతిజాగ్రత్తగా పట్టుకున్నందువల్లనేమో ఆ నోటు కాస్తా చేజారి కిందపడింది. పాపం అని నేను ఆ నోటు ఎత్తి ఆ పెద్దయ్యకివ్వబోతూండగా చూసాను ఆ నోటులోని తేడాని. అది చూడటానికి వెయ్యిరూపాయల నోటులా కనిపిస్తుంది కాని వెయ్యి అని ఉండాల్సిన చోట సున్నా ఉంది... ఏంటి నమ్మరా? మీ కళ్ళతో మీరే చూడండి


'ఇదేంది పెద్దయ్య, ఈ నోటు వింతగుందేం'అని అడిగితే, అది లోక్ సత్తా పార్టీ చలువ అని చెప్పాడు. "అవినీతిని అంతం చేద్దాం" అనే హెడ్డింగుతో ఈ సున్నా రూప్యముల నోటు కాన్సెప్టు కొత్తగా ఉంది, ‘నేను లంచం తీసుకోనని, మరెవ్వరికీ ఇవ్వజూపనని, ప్రమాణము చేయుచున్నాను’ అనే సందేశం చాలా బాగుంది అని అన్నాను, ఆ ముసలయ్య మాత్రం “ఏమి కొత్తో, ఏమి మంచో, ఎన్నికలుగందా పెద్దోళ్ళు ఎన్నడూ లేనట్టు మాబోటి బీదోళ్ళకి డబ్బులిస్తారూ, ఆ పైసలతో నూకలు కొని మా ఇంటిదానికీ, మా పిల్లగోళ్ళకి కూసింత బువ్వెడదామనుకున్నా బాబయ్యా, ఈళ్ళేమో ఈ సత్తు కాయితం సేతులో ఎట్టారు, ఇయ్యాళ కూడా మా గుడిసెలో గంజినీళ్ళే గతి” అని చెప్పుకుని తన చిరిగిన చొక్కాతో కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు.
ఏమి కలికాలమో ఎన్నికలంటే ప్రజలు ఏ నాయకుడు మంచివాడా, ఏ పార్టి నిజంగా తమ ప్రమాణాలు నిలబెట్టి దేశాన్ని సస్యశ్యామలం చేస్తుందా అని కాక మన పేదసోదరులు ఏ నేత డబ్బులిస్తాడా, ఏ పార్టీ సారాయి పోస్తుందా అని ఎదురుచూస్తున్నారు, ఇక మన ఆడపడుచులేమో ఏ పార్టీ ఖరీదైన చీర పెడితే ఆ పార్టీకే ఓటేద్దామని ముచ్చట్లు చెప్పుకుంటూ కనిపిస్తున్నారు, చీరకి ఇచ్చే విలువ, పోసిన సారాయి కి చూపించే విశ్వాసంలో పదో వంతో మన భవిష్యత్తు గురించి ఆలోచించే నేతల గురించో, సేవాతత్పరత ఉండే పార్టీని గుర్తించడంలోనో ఉంటే, మన రాజకీయాల ముఖచిత్రం కొంచమైనా మారుతుందేమో…..

సున్నా రూపాయిలైనా వెయ్యి రూపాయిలైనా చెరగని బోసినావులతో చూస్తూ ఉండె ఓ గాంధీ తాతా, నీ ముఖంలో ఉండే ఆనందం మా బడుగు సోదరుల ముఖాలలో ఎప్పుటికి చూడగలమంటావ్??

ఇంతా అయ్యాక మీరేమనుకుంటున్నారో నాకు తెలుసు ఆ పెద్దయ్యకి నేనన్నా ఏదొ ధన సహాయం చెయ్యాల్సిందనేగా? నేను దారినపోయే దానయ్యనే కాని మేడలోని కుబేరుడ్ని కాదుగా….

ఇట్లు భవదీయుడు
దారినపోయే దానయ్య

* ఇందులోని పాత్రలూ, సన్నివేశాలు కేవలం కల్పితం....

ఎలెక్షన్ పోస్టర్

రాష్ట్రమంతా ఎన్నికలహోరులో యమాబిజీగ ఉంది, ప్రతి ఒక్క పార్టి తమ తమ గొప్పదనాలని చాటుతూ ఎన్నో పోస్టర్లు ప్రచురించింది, ఈ తరుణంలొ మొన్నీమధ్య నేను కుకట్ పల్లి వెళ్ళాను అక్కడ ఎటు చూసినా కాంగ్రెస్ పార్టీ కి సంబంధించిన పోస్టర్లు దర్శనమిచ్చాయి.. ప్రింటింగన్నాక అచ్చు తప్పులుండటం సహజం … ఈ కింది పోస్టర్ని గమనించండి..



సెల్ ఫోనులో తీసినది కనుక అంత స్పష్టంగా ఉన్నట్టు లేదు… సరే అదే పోస్టర్ని ఇంకొంచం జూం చేసి తీసిన ఫొటో ఈ కిందది



పేద ప్రజల గుండె చప్పుడు కాంగ్రెస్, అని చాటే ఈ పోస్టర్లో బ్లూ హైలైటింగుతో ఉన్న రెండో లైను చూడండి.. 'ఇందిరమ్మ రాజ్యంలో సోనియాగాంధీ వై.యస్.ఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షం' అని ఉందనుకుంటున్నారా కాదు జాగ్రత్తగా చూడండి…


“రాష్ట్రం” అనే పదంలో “రా” అనే అక్షరం ఎగిరి పోయింది. అదేమంత పెద్ద తప్పిదం కాకపోవచ్చు, కానీ అసలే ఎవరెక్కడ చిన్న తప్పులతో దొరుకుతారా వారి డొక్క చింపి డోలు కట్టి దండోరా వేద్దామా అని నిత్యం ఎదురుచూసే ప్రతిపక్షాలకి, మీడియా బృందాలకి అవకాశమిచ్చినట్లే కదా… “ప్రచార పోస్టెర్లలోనే తప్పులు ప్రచురించే కాంగ్రెస్” అనో, “ఈ చిన్న తప్పిదాలనే గమనించని కాంగ్రెస్ రాష్ట్రం లో ఉండె అవకతవకలని ఇంకేం గమనిస్తుందనో” హెడ్డింగు పెట్టి యే పేపరో ప్రచురించిందనుకోండి….. ఇంకేం ఇక ప్రతిపక్షాలకి ఇంకో రెండు రోజులు చేతినిండా, నోటినిండా పని దొరికినట్లే..

ఏదేమైనా ప్రచురణాదోషాలను జాగ్రత్తగా గమనించి ఆ తరువాతే అతికించాలని ఈ నాయకులకో, ఆ కార్యకర్తలకో తెలిపేదెవరో.....


ఇట్లు భవదీయుడు
దారినపోయే దానయ్య