Monday, March 23, 2009

రూ. 0/- (రుపీస్ జీరో)

ఈ సంవత్సరం ఎలెక్షన్ ప్రచారాలు జోరుగానే కాదు వింతగా కూడా సాగుతున్నాయి. ఇవాళ పొద్దున్న అలా నెక్లెస్ రోడ్ కి షికారుకి వెళ్ళాను. అక్కడ ఒక ముసలయ్య చేతిలో ఏదొ తళతళలాడుతు ఒక నోటు పట్టుకుని, అటువైపు నుండి వస్తూ కనపడ్డాడు. అతిజాగ్రత్తగా పట్టుకున్నందువల్లనేమో ఆ నోటు కాస్తా చేజారి కిందపడింది. పాపం అని నేను ఆ నోటు ఎత్తి ఆ పెద్దయ్యకివ్వబోతూండగా చూసాను ఆ నోటులోని తేడాని. అది చూడటానికి వెయ్యిరూపాయల నోటులా కనిపిస్తుంది కాని వెయ్యి అని ఉండాల్సిన చోట సున్నా ఉంది... ఏంటి నమ్మరా? మీ కళ్ళతో మీరే చూడండి


'ఇదేంది పెద్దయ్య, ఈ నోటు వింతగుందేం'అని అడిగితే, అది లోక్ సత్తా పార్టీ చలువ అని చెప్పాడు. "అవినీతిని అంతం చేద్దాం" అనే హెడ్డింగుతో ఈ సున్నా రూప్యముల నోటు కాన్సెప్టు కొత్తగా ఉంది, ‘నేను లంచం తీసుకోనని, మరెవ్వరికీ ఇవ్వజూపనని, ప్రమాణము చేయుచున్నాను’ అనే సందేశం చాలా బాగుంది అని అన్నాను, ఆ ముసలయ్య మాత్రం “ఏమి కొత్తో, ఏమి మంచో, ఎన్నికలుగందా పెద్దోళ్ళు ఎన్నడూ లేనట్టు మాబోటి బీదోళ్ళకి డబ్బులిస్తారూ, ఆ పైసలతో నూకలు కొని మా ఇంటిదానికీ, మా పిల్లగోళ్ళకి కూసింత బువ్వెడదామనుకున్నా బాబయ్యా, ఈళ్ళేమో ఈ సత్తు కాయితం సేతులో ఎట్టారు, ఇయ్యాళ కూడా మా గుడిసెలో గంజినీళ్ళే గతి” అని చెప్పుకుని తన చిరిగిన చొక్కాతో కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు.
ఏమి కలికాలమో ఎన్నికలంటే ప్రజలు ఏ నాయకుడు మంచివాడా, ఏ పార్టి నిజంగా తమ ప్రమాణాలు నిలబెట్టి దేశాన్ని సస్యశ్యామలం చేస్తుందా అని కాక మన పేదసోదరులు ఏ నేత డబ్బులిస్తాడా, ఏ పార్టీ సారాయి పోస్తుందా అని ఎదురుచూస్తున్నారు, ఇక మన ఆడపడుచులేమో ఏ పార్టీ ఖరీదైన చీర పెడితే ఆ పార్టీకే ఓటేద్దామని ముచ్చట్లు చెప్పుకుంటూ కనిపిస్తున్నారు, చీరకి ఇచ్చే విలువ, పోసిన సారాయి కి చూపించే విశ్వాసంలో పదో వంతో మన భవిష్యత్తు గురించి ఆలోచించే నేతల గురించో, సేవాతత్పరత ఉండే పార్టీని గుర్తించడంలోనో ఉంటే, మన రాజకీయాల ముఖచిత్రం కొంచమైనా మారుతుందేమో…..

సున్నా రూపాయిలైనా వెయ్యి రూపాయిలైనా చెరగని బోసినావులతో చూస్తూ ఉండె ఓ గాంధీ తాతా, నీ ముఖంలో ఉండే ఆనందం మా బడుగు సోదరుల ముఖాలలో ఎప్పుటికి చూడగలమంటావ్??

ఇంతా అయ్యాక మీరేమనుకుంటున్నారో నాకు తెలుసు ఆ పెద్దయ్యకి నేనన్నా ఏదొ ధన సహాయం చెయ్యాల్సిందనేగా? నేను దారినపోయే దానయ్యనే కాని మేడలోని కుబేరుడ్ని కాదుగా….

ఇట్లు భవదీయుడు
దారినపోయే దానయ్య

* ఇందులోని పాత్రలూ, సన్నివేశాలు కేవలం కల్పితం....

4 comments:

  1. బాగుందయ్యా...ఎలెక్షన్స్ మీద బాగా కవరేజీ ఇస్తున్నవు..నేను ఈనాడు చదవలేకపోతున్నా అన్న లోటు తీర్చుతున్నందుకు థ్యాంక్స్!

    నా అనుమానం ఏమిటంటే...ఎన్నికలయ్యాక ఈ దానయ్య ఏం చేస్తాడా అని!!

    ReplyDelete
  2. ఈ దానయ్య, ఎన్నికలనే అంశాన్నే కాదు, కనిపించే ప్రతి సంగతినీ కెలుకుతూ ఉంటాడు... కనుక మున్ముందు మీకే తెలుస్తుంది ఈ దానయ్య సంగతి

    ReplyDelete
  3. లోక్‌సత్తా ఎత్తుకు లోకం సత్తా చేరాలని నా అభిలాష... ఎప్పటికి తీరుతుందో ఏమో! :-( ప్రభుత్వాన్ని బాగు చెయ్యటమంటే ప్రజలని బాగు చెయ్యటమేనన్న నిజం లోక్‌సత్తాయే కాదు సమాజం కూడా గ్రహించాలి. అంత దాకా ఇలాంటి సంఘటనలు తప్పవు! తప్పు అని తెలియని అమయాకులను, "నిరనుమానితు"లను (the unsuspected కి అచ్చమైన అనువాదం) తప్పుడు పద్ధతులకి అలవాటు చేయిస్తే పరిణామం...ఇదీ! ఏది ఏమైనా లోక్‌సత్తా చేస్తున్న కొన్ని పనులు చూసి సిగ్గు పడుతున్నాను... తప్పుగా చూడకు, ఆ సిగ్గు పడటం నేను ఇన్నాళ్ళూ ఈ పనులు చెయ్యనందుకు - అవి చాలా మటుకు పౌరుల కనీస బాధ్యతలే! :-(

    ReplyDelete
  4. bagundayya danayya ...ee zero rupees concept :)

    ReplyDelete